లింగాలకుంట వద్ద అనుమానాస్పద చొరబాట్లు..
మేడ్చల్ ముచ్చట్లు :మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ వెనుక భాగంలో ఉన్న లింగాలకుంట వద్ద అనుమానాస్పద త్రవ్వకాలు కలకలం రేపుతున్నాయి.గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం రహస్యంగా త్రవ్వకాలు జరిపినట్లు అక్కడి దృశ్యాలు సూచిస్తున్నాయి.ఆలయానికి కొద్దిదూరంలో ఉన్న లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొన్ని అడుగుల మేర భూమిని త్రవ్విన ఆనవాలు కనిపించాయి. త్రవ్వకాల్లో ఉపయోగించినట్లు భావించే ఓ మట్టికుండ, ఎర్రని గుడ్డ, పసుపు, నీళ్ల బాటిల్ వంటి వస్తువులు అక్కడే విడిచిపెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.ప్రాచీన కాలానికి చెందిన ఈ క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. పురాణాల ప్రకారం, సాక్షాత్తు శ్రీరాముడే ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. గతంలోనూ ఇక్కడ గుప్తనిధుల కోసం త్రవ్వకాలు జరిగాయని చెబుతూ వార్తలు వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మళ్లీ ఇదే ఘటన పునరావృతం కావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలు జరుగుతున్నా, వాటిని అడ్డుకోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి, పూర్తిస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.





