ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల నియ‌మాల‌ను పాటించాలి;కలెక్టర్

Telangana Chowrasta
4 Min Read
  • జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో 26,91,167 మంది ఓటర్లు, 2,397 పోలింగ్ కేంద్రాలు
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చ‌ల్ మ‌ల్కాజ‌గిరి జిల్లా: మేడ్చ‌ల్ మ‌ల్కాజ‌గిరి జిల్లా క‌లెక్ట‌రేట్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూ.చ. తప్పకుండా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, ప్రస్తుతం మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమలులో ఉందని పేర్కొన్నారు. షెడ్యూల్ విడుదల అనంతరం 72 గంటలు అతి ముఖ్యమని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులపై వాల్ రైటింగ్, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్లు తదితరాలన్ని 24 గంటల లోపు, అన్ని పబ్లిక్ స్థలాల్లో ఉన్న వాటిని 48 గంటల్లో, ప్రైవేట్లో ఉన్న వాటిని 72 గంటల లోపు తొలగించాలని కలెక్టర్ వివరించారు. అలాగే వెబ్సైట్లలో రాజకీయ నాయకుల ఫొటోలు తొలగించాలని ప్రభుత్వ వాహనాలు రాజకీయ అవసరాలకు వాడరాదని సూచించారు. దీంతో పాటు ప్రభుత్వ అతిథి గృహాలు, హెలీప్యాడ్, ప్రభుత్వ మైదానాలు ఫస్ట్ కమ్ ఫస్ట్ కి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి కొత్తవి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వీల్లేదని ప్రగతిలో ఉన్న పనులు మాత్రమే చేపట్టాలని కలెక్టర్ అమోయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రగతిలో ఉన్న, ఇంకా ప్రారంభం కాని కొత్త పనుల జాబితా తమకు సమర్పించాల్సిందిగా కలెక్టర్ వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొత్త పనులు చేపట్టడం, ప్రకటించటం వంటివి చేయరాదని కలెక్టర్ అమోయ్ కుమార్ పేర్కొన్నారు. సీ – విజిల్ పర్యవేక్షణ చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విద్యా సంస్థలు, విద్యార్థులు, యువతకు సీ– విజిల్ యాప్ పై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ఎన్నికల విధులు అత్యంత కీలకమని, ఏ దశలోనూ అలసత్వం వహించరాదని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని, స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై నవంబరు 10వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని. 13న స్క్రూటినీ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15, నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 171( బి) ప్రకారం డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం నేరమన్నారు. 171(సి) ప్రకారం ఓటర్లను బెదిరించడం నేరమని జిల్లా కలెక్టర్ తెలిపారు. సెక్షన్ 171(ఏ) ప్రకారం ప్రచార పోస్టర్లు, కరపత్రాలు ముద్రించే ప్రింటింగ్ సంస్థలు తప్పకుండా వాటిపై ప్రింటర్ పేరు, పబ్లిషర్ పేరు, మొబైల్ నెంబర్లను విధిగా ప్రచురించాలని అలా చేయనట్లయితే బాధ్యులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయని, జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలకు 2,397 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పురుషులు ఓటర్లు 3,06,854, మహిళా ఓటర్లు 2,88, 486 , ట్రాన్స్జెండర్స్ 42 మంది మొత్తం 5,95,382 మంది ఉన్నారని, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పురుషులు 2,36,804, మహిళా ఓటర్లు 2,32,009. ట్రాన్స్జెండర్లు 9 మంది మొత్తం కలిపి 4,68,822 మంది ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే కుత్భుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పురుషులు 3,51,307, మహిళా ఓటర్లు 3,17,793 మంది, ట్రాన్స్జెండర్లు 153 మంది మొత్తం ఓటర్లు 6,69, 253 మంది ఉన్నారని, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పురుషులు 2,34,575 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2,12,828 మంది, ట్రాన్స్జెండర్లు 120 మంది మొత్తం ఓటర్లు 4,47,527 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పురుషులు 2,65,493 మంది, మహిళా ఓటర్లు 2,44,657 మంది, ట్రాన్స్జెండర్లు 37 ఉండగా… మొత్తం ఓటర్లు 5,10,187 మంది ఉన్నట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో పురుషులు 13,95,033, మహిళా ఓటర్లు 12,95,773 మంది, ట్రాన్స్జెండర్లు 361 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 26,91,167 మంది ఉన్నారని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు.

Share This Article
Leave a Comment