తండ్రిని హత్య చేసి… సినిమాకు వెళ్లిన కుమార్తె

Telangana Chowrasta
2 Min Read

తల్లి, ప్రియుడితో కలిసి కుట్రపూరితంగా హత్య – చెరువులో శవం పడేసి దారుణం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలంలో ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. వివాహేతర బంధానికి అడ్డుగా మారాడన్న కారణంతో తండ్రిని కుమార్తె, ఆమె తల్లి, ప్రియుడితో కలిసి కడతేర్చింది. హత్య అనంతరం సెకండ్ షో సినిమా చూసేందుకు వెళ్లిన వారు, తిరిగి వచ్చి శవాన్ని క్యాబ్‌లో తీసుకెళ్లి ఎదులాబాద్ చెరువులో పడేశారు.

వివరాల్లోకి వెళితే…

హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం (45) ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగా పని చేస్తుండగా, అతని భార్య శారద (40) జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తె మనీషా (25) వివాహమై ఉండేది.

మృతుడు లింగం

తర్వాత భర్త స్నేహితుడు మహ్మద్ జావీద్ (24) అనే వ్యక్తితో మనీషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన తండ్రి లింగం కుమార్తెను మందలించడమే కాకుండా పలుమార్లు ఘర్షణకు దిగినట్లు సమాచారం. దీనికి మానసికంగా నొచ్చుకున్న మనీషా, తల్లి శారదతో కలిసి తన తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకుంది.

పన్నాగం – నిద్ర మాత్రలు, దిండు, క్యాబ్

ఈ నెల 5న, మనీషా నిద్రమాత్రలు తెచ్చి తల్లికి ఇచ్చింది. శారద వాటిని మద్యం కలిపి లింగానికి ఇచ్చింది. ఆ నిద్ర మత్తులో ఉన్న సమయంలో మనీషా, జావీద్, శారద ముగ్గురూ కలిసి అతని ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం సెకండ్ షో సినిమా చూసేందుకు వెళ్లి తిరిగి వచ్చి ఓ క్యాబ్‌ను బుక్ చేశారు.శవాన్ని కారులో ఎక్కిస్తున్న సమయంలో డ్రైవర్‌కు అనుమానం కలగగా, “కల్లు తాగి మత్తులో ఉన్నాడు” అని బుకాయించారు. కారులో ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద దిగిన తర్వాత, మృతదేహాన్ని నీటిలో పడేశారు.

పోలీసుల విచారణలో హత్య బయటకు

ఈ నెల 7న చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు పరిశీలన, నిందితుల వాంగ్మూలాలతో మొత్తం కుట్ర వెలుగులోకి వచ్చింది.

ముగ్గురు నిందితులు అరెస్ట్

ఈ దారుణ హత్యలో పాల్గొన్న మనీషా, తల్లి శారద, ప్రియుడు జావీద్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఘట్‌కేసర్ సీఐ పరశురాం తెలిపారు. విచారణను డీఐ శ్రీనివాస్, ఎస్సైలు శేఖర్, సాయికుమార్ నేతృత్వంలో కొనసాగిస్తున్నారు.

Share This Article
Leave a Comment