
మేడ్చల్ ముచ్చట్లు:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి, డేటా ఎంట్రీ పనులు చేసిన ఎన్యూమరేటర్స్కు పారితోషికం చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు చింతలపల్లి మండలంలో మాత్రం భిన్న పరిస్థితి నెలకొంది.స్థానిక సమాచారం ప్రకారం, ఇక్కడ అంగన్వాడీ టీచర్స్కి మాత్రమే పారితోషికం జమ అయ్యింది. కానీ సర్వేలో కష్టపడి పనిచేసిన ఎన్యూమరేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎవరికి కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అందరికీ డబ్బులు వచ్చాయి. కానీ మాకు మాత్రం ఎందుకు ఇవ్వలేదు? మా కష్టం వృథా కాకూడదు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలి” అని వారు కోరుతున్నారు.స్థానికంగా ఈ విషయం మీద చర్చలు జరుగుతున్నప్పటికీ, అధికారుల నుంచి ఇప్పటివరకు స్పష్టమైన స్పందన రాలేదు. ఇకపై అయినా సమస్యను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని ఎన్యూమరేటర్స్ డిమాండ్ చేస్తున్నారు.


