మేడ్చల్ ముచ్చట్లు:మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలు ఈ మధ్యకాలంలో మట్టి మాఫియాల అడ్డాగా మారాయి. రాత్రి పగలు తేడా లేకుండా టిప్పర్ల సహాయంతో మట్టిని అక్రమంగా తరలిస్తూ స్థానిక రహదారులను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు.తాజాగా లక్ష్మాపూర్ రెవెన్యూ పరిధిలో లక్ష్మాపూర్ నుండి కొట్యాల్ వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు సైతం సురక్షితంగా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రజల ఆరోపణల ప్రకారం, ఈ దందా వెనుక కొంతమంది ప్రభావశీలులు ఉన్నారని, అందుకే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. రైతులు కూడా తమ పొలాలకు రాకపోకలు చేయలేని స్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం, ఫార్మా కంపెనీలకు అధిక ధరలకు మట్టి సరఫరా అవ్వడంతో ఈ రవాణా రోజురోజుకీ పెరుగుతోందని. రాత్రివేళల్లో ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లు బహిరంగంగా తిరుగుతున్నా ఎవరూ అడ్డుకోవడం లేదని అంటున్నారు.
ఇకపోతే, గ్రామ రహదారులు, రైతుల పొలాల దారులు, మట్టి మాఫియా వల్ల దెబ్బతిన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
వాహనదారులు, రైతులు, గ్రామ ప్రజలు అందరూ ఇప్పటికైనా అధికారులు మేల్కొని కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే తమ హక్కుల కోసం రోడ్లపైకి దిగుతామని హెచ్చరిస్తున్నారు.



“మట్టి మాఫియా లో మారుమోగుతున్న గ్రామం మాది. మైనింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్ష ణ లోపం వలన మట్టి దందా యథేచ్ఛగా సాగుతున్నది. ప్రయివేట్ భూములలో, అస్సైన్ మెంట్ భూములలో, ఫారెస్ట్ భూములలో యథేచ్ఛగా రాత్రి పూట టిప్పర్ల తోని మట్టి రవాణ జరుగుతున్నది. మట్టి రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకున్న రెవిన్యూ అధికారులు ఎదో ఉడతాభక్తి గా ఫైన్లు వేసి వదిలేస్తున్నారు. రోడ్లు అన్ని గుంతలు ఏర్పడి గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోని మట్టి రవాణా జరుగకుండా చర్యలు తీసుకోవాలి. అన్ని శాఖలు సమన్వయం తో ఈ మట్టి మాఫియా ను ఆపాలని కోరుతున్నాము”




