సంగారెడ్డి, జూలై 8:
పటాన్చెరు మండలం పాశమైలారలోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జూన్ 30న జరిగిన ఘోర పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. చికిత్స పొందుతున్న మరో ఇద్దరు కార్మికులు మంగళవారం ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 44కి చేరింది.
వివరాల్లోకి వెళితే, సంగారెడ్డి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖలేశ్వర్, బీరంగూడ సమీపంలోని పనేసియా మెరిడియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరిఫ్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 8 మంది మరణించగా, ప్రస్తుతం ఇంకా 16 మంది కార్మికులు ప్రాణాలతో పోరాడుతున్నారు.

ఈ నేపధ్యంలో సిగాచి పరిశ్రమ బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడమే కాక, అన్ని విధాలుగా అండగా ఉంటామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు.
పేలుడులో గల్లంతైన మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. వారి కోసం ఫైర్ సర్వీసులు, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీసు బృందాలు శిథిలాల కింద ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. బాధితుల కుటుంబ సభ్యులు సహాయ కేంద్రం వద్ద ఆందోళనతో వేచి చూస్తున్నారు.


