- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషేక్ అగస్త్య
మేడ్చల్ కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అక్రమంగా డబ్బులు, మద్యం తరలించకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషేక్ అగస్త్యలు అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, డీసీపీ జానకీతో కలిసి జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నోడల్ అధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎక్సైజ్ శాఖ పోలీసు శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్లరాదని ఒకవేళ తీసుకువెలితే సరైన ద్రువపత్రాలు కలిగి ఉండాలని లేని పక్షంలో నగదును సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలు తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ఉందని దీనిని దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో డబ్బలు తీసుకెళ్ళడం కానీ, మద్యం తరలించడం కానీ చేయకుండా పటిష్ట బందోబస్తు, నిఘా ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. డబ్బులకు సంబంధించి నిబంధనల మేరకు తీసుకెళ్ళాలని అలా కాకుండా అతిక్రమించినట్లయితే వాటిని సీజ్ చేయాలని అందుకు సరైన ఆధారాలు ఉన్నట్లయితే తిరిగి వారికి అప్పగించాలన్నారు. ప్రజలు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్ళరాదని సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషేక్ అగస్త్యలు కోరారు. అలాగే అక్రమంగా మద్యం తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని అందుకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటేనే వదిలిపెట్టాలని లేనట్లయితే వాహనాలు, మద్యం సీజ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేసి ప్రశాంత వాతావరణంలో జిల్లాలో ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పని చేయాలని సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో జిల్లాలోని నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పోలీసు శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖల అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



