భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు – వెంకట గోపాల్

మేడ్చల్ ముచ్చట్లు: గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో వినాయక నిమజ్జనాలను ప్రజలందరూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ సూచించారు.
ఈ సందర్భంగా బీసీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వినాయక నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన బారికేడ్లు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం సుతారిగూడ చెరువు, నారాయణ చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కల తొలగింపు చర్యలపై చర్చించారు.
అలాగే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో అర్హులపై, అర్హులు కానివారి జాబితాను సిద్ధం చేసి సమగ్ర నివేదిక అందజేయాలని కమిటీ సభ్యులను కోరారు. ఆమోదం పొందిన ఇండ్ల ప్రస్తుత స్థితిగతులపై కూడా సమీక్ష చేపట్టారు.
ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ సాయి పేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నరేందర్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ చైర్మన్లతో పాటు పలువురు పాల్గొన్నారు.


