మేడ్చల్ ముచ్చట్లు:మౌలాలి కృష్ణానగర్ లోని శ్రీరంగరిపై వెలసిన గోదారంగనాథ స్వామి దేవాలయంలో లక్ష తులసీ శ్రీవిష్ణు సహస్ర నామార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పవిత్ర శ్రావణమాసంలో సంకల్పించిన ఈ విశేష అర్చనా కార్యక్రమంలో ఉప్పల్ బిఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పోరేటర్లు, ఇతర ప్రముఖులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రీరంగగిరి ఆలయ నిర్మాణంతో, అభివృద్ధిలోనూ తమ కుటుంబానికి అవినాభావ సంబంధం వున్నదని, తన సోదరుడు బండారి రాజిరెడ్డి ఈ ఆలయ ప్రారంభానికి ఎంతో సహాయసహకారాలను అందించారని లక్ష్మారెడ్డి తెలిపారు. అంతకు ముందు సౌందర్యలహరి ప్రేమలత, అశేష సంఖ్యలో వారి బృద సభ్యులు ఆలయంలో శ్రీవిష్ణు సహస్ర నామార్చన మూడు పర్యాయాలు పారాయణం చేశారు. అనంతరం పవిత్రమైన నారాయణీయమ్ శ్లోకాలను పారవశ్యం తో లయాన్వితంగా పఠించారు. స్వామికి నివేదించిన వివిధ రకాల ప్రసాదాలను భక్తులకు వితరణ చేశారు. భగవంతుని నామ పారాయణంతో రంగగిరి కొండ ప్రతిధ్వనించింది.




