గంజాయి అమ్ముతున్న వ్యక్తులను పట్టుకున్న పోలీసులు

Telangana Chowrasta
1 Min Read

పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు

మేడ్చల్ ముచ్చట్లు : శామీర్పేట పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో దొంగల మైసమ్మ వద్ద గంజాయి విక్రయానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. ఈ సంఘటన  మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సోమిరెడ్డి  సిబ్బందితో కలిసి ఇద్దరు గంజాయి పెడ్లర్స్ తో పాటు ఒక వినియోగదారున్ని అదుపులోకి తీసుకున్నారు.నిందితుల్లో ఒడిశా కి చెందిన రాహుల్ కార ,రాజు మడకం, కలకత్తా కి చెందిన సృష్టి చౌదరి ఉన్నారు.

ఒడిశాకు చెందిన పెడ్లర్స్
విచారణలో పట్టుబడిన రాహుల్ కార, రాజు మడకం కొంపల్లి ప్రాంతంలో సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గంజాయి వ్యాపారంలోకి దిగారని పోలీసులు వెల్లడించారు. మల్కానగిరి నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, కొంపల్లి, దేవరయంజాల్, తూముకుంట పరిసర ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

రెండు కిలోల గంజాయి స్వాధీనం
ఇదివరకూ కూడా ఇదే తరహా వ్యాపారం జరిపి డబ్బులు సంపాదించినట్లు నిందితులు అంగీకరించారు. తాజాగా మల్కానగిరి నుంచి రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి అమ్మేందుకు సిద్ధమవుతుండగా, పోలీసులు వారిని పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో సృష్టి చౌదరి గంజాయి కొనుగోలు చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రిమాండ్‌కు తరలింపు
పట్టుబడిన ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ సోమిరెడ్డి తెలిపారు. అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Share This Article
Leave a Comment