
మేడ్చల్ ముచ్చట్లు :వినాయక ఉత్సవాల్లో భాగంగా రాఘవేంద్ర నగర్ కాలనీలో నిర్వహించిన చిన్నారుల ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను అభినందించారు.
ఆయన మాట్లాడుతూ, “ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఆధ్యాత్మికత గొప్ప తోడ్పాటు అందిస్తుంది. అన్నమయ్య కీర్తనలు, భక్తిరస ప్రధాన గీతాలకు చిన్నారులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు అభినందనీయమైనవి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 108 ప్రసాదాలను సమర్పించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు సాగాయి. ఏసీపీ శంకర్ రెడ్డి ప్రజలు ఉత్సవాలను శ్రద్ధగా జరుపుకోవాలని, నిమజ్జనంలో నిబంధనలు పాటించి, పోలీసులకు సహకరించాలని కోరారు.
చివరిగా, సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులను అభినందిస్తూ బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


