నీట మునిగిన కాలనీల్లో బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి పర్యటన

Telangana Chowrastha
1 Min Read

తెలంగాణ చౌరస్తా ; భారీ వర్షాలతో వరంగల్ నగరం నీట మునుగుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఊరేగడం సరికాదని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి గానీ, ప్రజలు ఆపదలో ఉంటే రావా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. హనుమకొండలోని జులైవాడ, అమరావతి నగర్, సమ్మయ్య నగర్, 100 ఫీట్ రోడ్డు తదితర జలమయమైన ప్రాంతాల్లో ఆయన గ్రేటర్ వరంగల్ అధికారులతో కలిసి పర్యటించి, వరద పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ… “మొంథా తుఫాన్ కారణంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజల ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు, టీవీలు, బీరువాల వంటి విలువైన వస్తువులు నాశనమయ్యాయి. వృద్ధులు, వికలాంగులు, బాలింతలు రాత్రంతా నీళ్లలోనే గడపాల్సి రావడం దారుణం” అని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాన్ తీవ్రతను ముందస్తుగా అంచనా వేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆయన ఆరోపించారు.

సమ్మయ్య నగర్‌లో పశువులు, గేదెలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఆస్తి నష్టంతో పాటు పశుపక్షాదుల ప్రాణ నష్టం కూడా భారీగా ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని మండిపడ్డారు. 

Share This Article
Leave a Comment